namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 3:04 pm Digital Edition : NAMASTE VEMULAWADA

వేములవాడలో TUF TV ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సన్నాహక సదస్సు*

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ ఉద్యమ కళాకారుల ప్రధాన కార్యాలయంలో బుధవారం TUF TV ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సన్నాహక సదస్సు ఘనంగా నిర్వహించారు. కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు బొజ్జ కనకయ్య, న్యాయ సలహాదారులు నేరెళ్ల తిరుమల గౌడ్, TUF TV రాష్ట్ర చైర్మన్ వెంగళ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిరె రవి, సావణపల్లి లక్ష్మీనారాయణ, వనం రాజయ్య మరియు బిల్ల వెంకట్ నరసయ్య కళాబృందాలు ఆలపించిన ఉద్యమ గీతాలు, ఒగ్గు కథలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి బొజ్జ కనకయ్య మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో డాక్టర్ చీమ శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సదస్సును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 33 జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు బాధ్యత తీసుకుని కళాకారులను భారీ సంఖ్యలో తరలించాలని యెల్ల పోశెట్టి కోరారు. ఈ సందర్భంగా TUF TV ఛానల్ రాష్ట్ర చైర్మన్ వెంగళ భాస్కర్‌ను, ఆఫీస్ మేనేజర్ పడాల శ్రీధర్‌ను ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 13 మండలాల అధ్యక్షులు, మహిళా కళాకారులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలిరావాలని జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య విజ్ఞప్తి చేయగా, జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు, దక్షిణ తెలంగాణ కన్వీనర్ వెన్నెమల్ల వెంకటేష్, జిల్లా నాయకులు కనపర్తి హనుమాండ్లు, బుర్రి శంకరయ్య, వివిధ మండలాల ప్రతినిధులు వనం రాజయ్య, బిల్ల వెంకట్ నరసయ్య, కల్లెడ నరసయ్య, ఎర్ర రవిరాజు తదితరులు పాల్గొన్నారు.